అదిగో పంచెకట్టు.. ఇదిగో చీరకట్టు.. పల్లెటూరి స్టైల్లో ప్రీ-వెడ్డింగ్ షూట్.. అదుర్స్ కదా! - Chattisgarh Pre Wedding Shoot Trending
ప్రీ-వెడ్డింగ్ షూట్.. ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్. పెళ్లికి ముందు జరిగే ఈ షూటింగ్ కల్చర్ దేశంలోని వివిధ నగరాలతో పాటు పల్లెలకూ పాకింది. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టు వారు ప్రీ-వెడ్డింగ్ షూట్లను తీస్తుంటారు. ఇందుకోసం కొందరు వైవిధ్యమైన లోకేషన్లను ఎంపిక చేసుకుంటే మరికొందరు సాదాసీదాగా ఉండే స్పాట్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటి కోవలోనిదే. అచ్చం పల్లెటూరి నేపథ్యంలో తీసిన ఈ ప్రీ-వెడ్డింగ్ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ అందులో మెరిసిన నవ వధూవరులను మెచ్చుకుంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లా పురాణి బస్తీకి చెందిన దేవేంద్ర రాథోడ్‌కు ఇదే జిల్లాకు చెందిన రష్మితో మే 3న వివాహం జరగనుంది. ఈ క్రమంలో అందరి లాగే వీరు కూడా పెళ్లికి ముందు ఓ ప్రీ-వెడ్డింగ్ వీడియోను షూట్ చేశారు. కాకపోతే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి తమ జీవితంలో గుర్తుండిపోయే విధంగా దీనిని చిత్రీకరించారు. ఇందుకు తగ్గట్టుగానే తమ సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ కట్టుబాట్లను తెలియజేసే విధంగా వధువు చీరకట్టుతో పాటు అక్కడి మహిళలు ధరించే నగలు వేసుకొని స్టెప్పులేసింది.
మరోవైపు వరుడు కూడా పంచెకట్టుతో తలకు పాగా కట్టుకొని కాబోయే భార్యతో చిందులేశాడు. పూర్తిగా పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా తీసిన ఈ షూట్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇకపోతే వరుడు దేవేంద్ర రాథోడ్ వృత్తిరీత్యా ఇంజనీర్. ఇక ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ సొంత రాష్ట్రంపై ఉన్న ప్రేమతో వారి సంస్కృతిని ఇతరులకు తెలియజేసేట్టుగా చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం అందరి నుంచి మంచి ప్రశంసలు పొందుతోంది.