'సంతోషాల పంట పండిద్దాం'- పొలంలో యువరైతు ప్రీ వెడ్డింగ్ షూట్
Published : Nov 22, 2023, 10:51 AM IST
Pre Wedding Shoot In Agriculture Land :సాధారణంగా ప్రీ వెడ్డింగ్ షూట్లో కాబోయే వధూవరులు రంగురంగుల దుస్తులు ధరించి, జలపాతాలు, వంతెలనల వద్ద ఫొటోలు దిగుతారు. అలాగే వీడియో షూట్లో పాల్గొంటారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ యువ రైతు మాత్రం అందుకు భిన్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. ఫొటోషూట్‌లో భాగంగా కాబోయే వరుడు అభిలాస్ పొలాన్ని నాగలితో దున్నాడు. అనంతరం కాబోయే భార్యతో ఎద్దుల బండిలో ప్రయాణించాడు. అభిలాస్ చేసిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
చామరాజనగర జిల్లాలోని హోసమలంగి గ్రామానికి చెందిన యువరైతు అభిలాస్కు కృతిక అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే అందరికంటే భిన్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్ భిన్నంగా ఉండాలని, అందరికీ రైతు ప్రాధాన్యం తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు అభిలాస్. ఈ క్రమంలో తన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను వరిపొలంలో నిర్వహించాడు. కాబోయే భార్యతో కలిసి పొలానికి ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాడు. పొలంలో నాగలితో దున్నుతున్నట్లుగా షూట్ చేయించారు. మధ్యాహ్న ఆ వీడియోలో రైతులకు ఇష్టమైన రాగిముద్దను తయారుచేయించి షూట్ చేయించాడు.
చిన్నప్పటి నుంచి తనకు వ్యవసాయమంటే ఇష్టమని యువరైతు అభిలాస్ చెప్పాడు. ప్రైవేటు కంపెనీలో తక్కువ వేతనానికి ఉద్యోగం చేసేకన్నా నచ్చిన వ్యవసాయాన్ని చేస్తూ ఆనందంగా జీవించాలమే మేలని తెలిపాడు. తాను వివాహం చేసుకోబోయే యువతి వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినదని అన్నాడు.