Prathidwani : ఆరోగ్య రంగంలో 11వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరిన తెలంగాణ.. నంబర్ 1కు చేరాలంటే ఇంకేం చేయాలి..? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
Published : Sep 25, 2023, 10:48 PM IST
Prathidwani Debate on Telangana Health Department :తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసింది. 9 ఏళ్లలో వైద్యశాఖలో 22,600 పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించింది. 7291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది అన్న ప్రభుత్వం.. పదేళ్లలో విప్లవాత్మక మార్పులు సాధించినట్లు ప్రకటించింది. 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2022 నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో 3వ స్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే ఆరోగ్య సూచీలో మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది. గతంలో లేని విధంగా రూ.12,364 కోట్ల బడ్జెట్‌తో ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపింది. ఒక్కొక్కరి వైద్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532గా పేర్కొన్న ప్రభుత్వం.. ఎలాంటి అత్యవసర పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంది. గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణ స్థాయిలో బస్తీ దవాఖానాలు, నియోజకవర్గ స్థాయిలో 100 పడకల ఆస్పత్రుల బలోపేతంతో.. పేదలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇన్ని వసతులు, మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నా.. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులకు మరింత నమ్మకం పెరిగేందుకు ఏం చేయాలి అనే అంశంపై నేటి ప్రతిధ్వని.