Prathidwani Debate on Centre New Bill: కేంద్రం మరో వివాదాస్పద బిల్లు.. ఎన్నికల సంఘం స్వతంత్రతకు ముప్పా..? - ప్రతిధ్వని డిబేట్
Prathidwani Debate on Centre New Bill: ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణపదం.. ఎన్నికలు. వాటిని స్వేచ్ఛగా, సక్రమంగా జరిపే గురుతర బాధ్యతను రాజ్యాంగం.. కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. కానీ పాలకులు దశాబ్దాలుగా ఆ స్ఫూర్తిని ఎంతమేర ముందుకు తీసుకెళ్తున్నారన్నదే ప్రశ్న. ఫలితంగా ఈసీ ఏలినవారి కనుసన్నల్లో నడుస్తూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం ఇదే విషయంలో రేగిన వివాదం సుప్రీం కోర్టుకూ వెళ్లింది. ఎన్నికల కమిషనర్లు... ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమించాలి? ఆ ప్రక్రియ ఎలా ఉండాలనే దానిపై సుప్రీం ధర్మాసనం దిశానిర్దేశం చేసింది. ఇప్పుడా విషయంలో కొత్త బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. సీఈసీ, ఈసీ ఎంపికలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని తీసుకునేందుకు ప్రతిపాదిస్తూ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈసీ నియామకాలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను.. నీరుగార్చేలా ప్రభుత్వ చర్య ఉందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. మూకుమ్మడిగా వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ బిల్లు ద్వారా ఎన్నికల సంఘం బలోపేతం అవుతుందా? విపక్షాలు భయపడుతున్నట్లు బలహీనం అవుతుందా? ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉందా లేదా? ప్రభుత్వాలు ఈసీపై ఆధిపత్యం కోరుకుంటున్నాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
TAGGED:
prathidwani