PRATHIDWANI: నూతన విధానంతో ఏయే మార్పులు చోటు చేసుకుంటాయి..? - ప్రతిధ్వని
స్కూళ్లలో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. కనిష్ఠ వయసును ఆరేళ్లుగా పేర్కొన్న కేంద్రం.. ఈ నిబంధన అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలోనూ ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యా శాఖ గుర్తు చేసింది. దాని ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని పేర్కొంది.
పిల్లలను బడిలో ఏ వయస్సులో చేర్చాలి? టీచర్లు చెప్పే విషయాలను వారు ఏ వయస్సులో ఆకళింపు చేసుకోగలుగుతారు? గతంలో విద్యా కమిషన్లు ఏం చెప్పాయి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానంలో ఏఏ మార్పులు చోటు చేసుకున్నాయి? ఇవి ఎప్పటి నుంచి అమలు కానున్నాయి? ఇప్పటికే విద్య అభ్యసిస్తోన్నవారి పరిస్థితి ఏంటి? అసలేంటీ కొత్త నిబంధన? దీనిపై తల్లిదండ్రుల స్పందన ఏంటి? అసలు బడిలో చేరే వయస్సు ఎప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్, అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్ష కార్యవర్గ సభ్యులు రమేష్ పట్నాయక్, తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవిలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.