పోలింగ్ కేంద్రాలకు కరెంటు కష్టాలు - చీకటిలోనే ఓటింగ్ - నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రాలకు కరెంటు కష్టాలు
Published : Nov 30, 2023, 9:41 AM IST
Power Cut in Polling Stations Nizambad : నిజామాబాద్ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాలకు కరెంటు కష్టాలు తలెత్తాయి. భారీ వర్షానికి చెట్లు విరిగిపడి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాలపై పడిపోవడంతో తీగలు తెగిపడ్డాయి. దీంతో బోధన్ డివిజన్‌లోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం పోలింగ్ కేంద్రాలు చీకటి మయమయ్యాయి.
నగరంలోని బాలభవన్‌లో ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిలోనే పోలింగ్ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దోమలతో సావాసం చేస్తూ.. క్యాండిల్, సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేయడం గమనార్హం. వడగళ్ల వాన బీభత్సంతో విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 351 విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. 17 ఉప కేంద్రాల్లో నష్టం వాటిల్లింది. మొత్తంగా ఆ శాఖకు రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.