కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరగొచ్చు - ఆందోళన వద్దు : పొంగులేటి
Published : Nov 8, 2023, 11:50 AM IST
Ponguleti Srinivas Reddy Fires On KCR : త్వరలోనే తనపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ తరహా కుట్రలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనటానికి ఈ దాడులే నిదర్శనమని చెప్పారు. కొన్నిరోజుల పాటు కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందులు తప్పవని.. ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అందుకే ఇందులో చేరానని పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కేసీఆర్ అనేక సభలలో చెబుతున్నారని.. దాని నిజ స్వరూపంపై కేంద్రం నివేదికలు ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు ఏదో ఒక రోజు కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డపై దర్యాప్తు సంస్థలే నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వevdvf ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.