Ponguleti Srinivas fires on KCR : 'కేసీఆర్ దోచుకున్న ప్రతి పైసాను వడ్డీతో సహా కట్టిస్తాం' - Congress latest news
Ponguleti Srinivas Latest Comments : ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దోచుకున్న ప్రతి పైసాను వడ్డీతో సహా కక్కిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. 'తెలంగాణకు అప్పు మిగిలిందని కేసీఆర్ కుటుంబానికి డబ్బు మిగిలిందని' ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా గాంధీభవన్‌కు వచ్చిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవి పట్ల అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే ఇప్పటి బీఆర్‌ఎస్ నేతలు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. తనపై వస్తోన్న భూకబ్జా ఆరోపణలను పొంగులేటి ఖండించారు. తనపై బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఆర్ గార్డెన్ నిర్మించి 13ఏళ్లు అయ్యిందని ఇంతవరకు ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. తాను 20 గుంటల భూమి కబ్జా చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా..! అని ప్రశ్నించారు. వర్షం కారణంగా కొల్లాపూర్ సభ వాయిదా పడిందని ఈనెల చివరలో సభ ఉంటుందని ప్రకటించారు. సీనియర్లతో కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పొంగులేటి స్పష్టం చేశారు.