Ponguleti Reaction on CM KCR Comments : 'నేను నిజాయతీగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నా.. మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలి' - తెలంగాణ రాజకీయ వార్తలు
Published : Oct 28, 2023, 3:53 PM IST
Ponguleti Reaction on CM KCR Comments :ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పాలేరు సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడి చేసిన పొంగులేటి.. ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఉచ్చరించడానికీ సీఎంకు నైతిక హక్కు లేదన్నారు. ఖమ్మం సంజీవరెడ్డి భవన్‌లో ఆయన మాట్లాడారు. డబ్బుల మూటలతో వస్తున్నారని సీఎం కేసీఆర్ తనపై పరోక్ష ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ల కాలంలో అన్ని విధాలుగా దోచుకొని.. ఆ డబ్బుతో మదమెక్కి దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. తాను వ్యాపారం చేసి ప్రభుత్వానికి పన్ను కట్టి నిజాయతీగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నానని.. కేసీఆర్ కుటుంబం ఏ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు సంపాదించారో చెప్పాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని.. గెలిచిన తర్వాత విచారణ జరిపి తిన్న డబ్బు అంతా కక్కిస్తామని అన్నారు.