ఈ చాక్లెట్ల తయారీ చూస్తే.. జీవితంలో మళ్లీ ముట్టుకోరు.. - తెలంగాణ తాజా వార్తలు
Police seized chocolates worth 3 lakhs at rajendranagar: ఈ మధ్య కాలంలో కల్తీ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి వస్తువుకు డూప్లికేట్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యక్తుల తీరు మారటం లేదు. తాజాగా చిన్నపిల్లలు తినే చిరుతిండ్లను తయారు చేసే వ్యాపారాన్ని అనుమతులు లేకుండా నడుపుతున్నారు. దీంతో నాణ్యతలేని పదార్థాలను తినటం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లో జరిగింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి సులేమాన్ నగర్‌లో అనుమతులు లేకుండా చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, లాలిపాప్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై హైదరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహార భద్రత సంస్థ అనుమతులు లేకుండానే అహ్మద్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా.. గుట్టుచప్పుడు కాకుండా నకిలీ చాక్లెట్లు తయారుచేస్తున్నాడు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు, దోమల మధ్య వీటి తయారీ జరుగుతోందన్న విషయం గురించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాడులు చేసి 3 లక్షల విలువైన చాక్లెట్లను సీజ్ చేశారు.