Police Seize Huge Money in Telangana : పోలీసుల సోదాల్లో పట్టుబడుతున్న భారీ నగదు.. ఏటీఎం డబ్బులు సైతం సీజ్..! - సరైన పత్రాలు లేని డబ్బును పోలీసులు స్వాధీనం
Published : Oct 19, 2023, 7:01 PM IST
Police Seize Huge Money in Telangana : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, మద్యం, బంగారం మొదలగు విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో.. ఏటీఎంలలో డబ్బులు పెట్టే సీఎమ్ఎస్ సంస్థ వాహనం ఒకటి సరైన పత్రాలు లేకుండా.. రూ.74 లక్షలు తరలిస్తుండడంతో పట్టణ సీఐ షేక్‌లాల్ మదార్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు చేపట్టిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా వ్యానులో తరలిస్తున్న రూ.27.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ సొమ్ముకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బులను పోలీసులు సీజ్ చేశారు. నగదు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారుల సూచన మేరకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జమ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.