ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు - బోధన్ తాజా వార్తలు
Published : Dec 26, 2023, 2:46 PM IST
Police Searching For Ex MLA Shakil's Son : ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం ఘటనలో విచారణ వేగంగా సాగుతోందని పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రమాదానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కారణమని తెలిసిందని చెప్పారు. తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించాలని ప్రయత్నించినట్టు గుర్తించామని వివరించారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే : ఈనెల 23వ తేదీన తెల్లవారుజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ వద్ద ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడి కి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో నిందతుడు కావాలనే తప్పిపోయాడా ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహిల్ కోసం గాలిస్తున్నారు.