Child Kidnap in Hyderabad: పసికందు కిడ్నాప్ కథ సుఖాంతం
Child Kidnap In Hyderabad: అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నెలల శిశువును అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. పాపను ఎత్తుకెళ్లిన మహిళ, యువకుడిని ఉప్పుగూడ రైల్యే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై తల్లి వద్ద ఉన్న పసిపాపను కిడ్నాప్ చేసి.. ఇతర ప్రాంతానికి తీసుకెళుతున్న సమయంలో రైల్వే పోలీసుల సహాయంతో పాపను కాపాడారు. కిడ్నాప్ చేసిన వారు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా పాపను కాపాడామని పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై ఓ తల్లి తన రెండు నెలల పసికందుతో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పాప తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ దగ్గరలోని సీసీ పుటేజీని పరిశీలించారు. పసి పాపను అపహరించింది.. ఓ మహిళ, యువకుడిగా పోలీసులు గుర్తించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో కేసును ఛేదించి.. కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు.