తుమ్మల ఇంట్లో సోదాలు - మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
Published : Nov 8, 2023, 4:17 PM IST
Police Raids in Thummala Nageswara Rao House : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. పోలీసులతో పాటు కొందరు ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం శ్రీ సిటీలోని తుమ్మల నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తుమ్మల ఉదయమే తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు వచ్చారు.
ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి.. సొమ్మును పెద్ద మొత్తంలో ఇంట్లో దాచి ఉంచారని సీ-విజిల్ యాప్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు.. దాడులు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. ఆ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు సతీమణి భ్రమరాంబ, అనుచరులు.. తనిఖీ అధికారులకు సహకరించారు. సోదాల్లో ఏమీ దొరకకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. మరోవైపు తుమ్మల నివాసంలో సోదాలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబడుతున్నారు.