పోలీసు అధికారిని గుంతలో పడేసి.. వేట కొడవలితో.. - ఎస్సైపై దాడి
Police Inspector attacked by villagers: మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ ఎస్సైని గుంతలో పడేసి వేట కొడవలితో దాడి చేసేందుకు యత్నించిన సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. లామాతపుట్ తహసీల్ పరిధిలో చేపట్టిన అరుదైన కయోలినైట్ మైనింగ్ వద్దకు నందపుర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రఫుల్లా లాక్రా సోమవారం తన సిబ్బందితో వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన గ్రామస్థులు మైనింగ్ చేయటాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రఫుల్లాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఎస్సైని కొందరు బలంగా నెట్టేశారు. పక్కనే ఉన్న గుంతలో పడిపోయారు. ఓ వ్యక్తి వేట కొడవలితో దాడి చేసేందుకు యత్నించగా పక్కనే ఉన్నవారు అడ్డుకున్నారు. కయోలినైట్ మైనింగ్‌ను నిలిపివేయాలని గత కొన్నేళ్లుగా ఖడిమటి సురక్ష్య సమితి ఆధ్వర్యంలోని మూడు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సైపై దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు నందపుర్ ఎస్డీపీఓ సంజయ్ మహాపాత్ర తెలిపారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST