Police Fight In Bihar Nalanda : లంచం వాటాల్లో తేడాలు.. నడిరోడ్డుపైనే కొట్టుకున్న పోలీసులు! - లంచం వాటా విషయంలో రోడ్డుపైనే కొట్టుకున్న పోలీసులు
Published : Sep 18, 2023, 5:01 PM IST
Police Fight In Bihar Nalanda District : ఓ కేసు విషయంలో తీసుకున్న లంచం డబ్బు పంపకాల్లో తేడాలు రావడం వల్ల డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై ఘర్షణకు దిగారు. ఈ ఆశ్చర్యకర సంఘటన బిహార్లోని నలంద జిల్లాలో వెలుగు చూసింది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ స్థానికుడు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైలర్గా మారి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీనితో సంబంధిత పోలీసులపై ఆయన చర్యలు తీసుకున్నారు.
ఇదీ జరిగింది..!
డబ్బు వాటా విషయంలో ఇద్దరి పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో జరిగింది. వాస్తవానికి గొడవ పడిన ఇద్దరు పోలీసులు 112 ఎమర్జెన్సీ సేవల్లో ఉన్నారు. ఓ కేసు విషయంలో సెటిల్మెంట్ కింద సదరు వ్యక్తి దగ్గర పోలీసులు కొంత డబ్బును డిమాండ్ చేశారు. ఇలా అందుకున్న సొమ్మును ఇద్దరూ పంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వాటాల విషయంలో తేడాలు రావడం వల్ల ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో పోలీస్ వాహనంలో నుంచి బయటకు దిగి మరీ రోడ్డుపైనే కొట్టుకున్నారు. దీనితో అక్కడే ఉన్న ఓ స్థానికుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్గా మారి జిల్లా ఎస్పీ అశోక్ మిశ్రా కంటపడింది. దీనిపై స్పందించిన ఆయన వెంటనే చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన స్పష్టమైన కారణంతో పాటు ఆ ఇద్దరు పోలీసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.