NSUI: మంత్రి సబిత ఇంటి ముట్టడికి NSUI యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు - తెలంగాణ తాజా వార్తలు
NSUI protest in Hyderabad today: యూనివర్సిటీల పేరుతో విద్యార్థులను మోసగిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టడించడానికి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నేతృత్వంలో విద్యార్థి సంఘం కార్యకర్తలు హైదరాబాద్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి తరలివచ్చారు.
అప్పటికే సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద పోలీసులు మోహరించారు. మంత్రి నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎన్ఎస్యూఐ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. బల్మూరి వెంకట్ సహా.. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల ముసుగులో కొన్ని కళాశాలలు విద్యార్థులను మోసం చేస్తున్నాయని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అనుమతి లేని ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాటి గుర్తింపు రద్దు చేసే వరకు ఎన్ఎస్యూఐ పోరాడుతుందని స్పష్టం చేశారు.