IPL Betting Gang Arrested : IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.1.84 కోట్లు స్వాధీనం - హైదరాబాద్ నేర వార్తలు
IPL Betting Gang Arrested in Hyderabad : నగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లతో భారీగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.కోటీ 84 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నర్సింగ్‌రావు అనే వ్యక్తి యాప్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నర్సింగ్‌రావు సబ్ బుకీ కాగా.. ప్రధాన బుకీ గణపతిరెడ్డి పరారీలో ఉన్నాడని చెప్పారు. నర్సింగ్‌రావు నుంచి రూ.60 లక్షల నగదు సహా మిగతా సొత్తు బ్యాంకుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఎస్వోటీ బాలానగర్ టీం మరో బెట్టింగ్ ముఠాను పట్టుకుందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వినోద్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి నుంచి రూ.ఏడు లక్షలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వజ్ర త్రిబుల్ సెవెన్ డాట్ కామ్, వజ్రా ఎక్స్ఛేంజ్, మెట్రో ఎక్స్ఛేంజ్, రాధ ఎక్స్ఛేంజ్, ఫోకస్ బుక్ 247, వర్మ త్రిబుల్ సెవెన్ యాప్‌ల ద్వారా ఈ ముఠా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం అమలులో ఉందని సీపీ తెలిపారు.