వరద నీటిలోనే ఎర్రకోట, మహాత్ముని సమాధి.. దిల్లీలో మళ్లీ భారీ వర్షాలు! - దిల్లీ వరద పరిస్థితి అప్డేట్
Delhi Flood Situation Update : దిల్లీ నగరం ఇంకా వరద గుప్పిట్లోనే ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం వల్ల యమునా నదిలో ప్రమాద స్థాయి మించి 206.2 మీటర్ల మేర ప్రవాహం ఉంది. రాజధాని వీధుల్లో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎర్రకోట పరిసరాలు, మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరద నీటిలోనే ఉన్నాయి. కశ్మీర్ గేట్ వద్ద మోకాల్లోతు ఉన్న వరద నీటిలో వాహనదారులు, పాద చారులు ఇబ్బంది పడుతున్నారు. దిల్లీలో ఆదివారం కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా ముసేసిన చంద్రవాల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను తిరిగి తెరుస్తామని దిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు.
ఫ్రాన్స్, యూఏఈ పర్యటన ముగించుకుని శనివారం భారత్ చేరుకున్న మోదీ.. వరద పరిస్థితిపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను అడిగి వివరాలు తెలుసుకున్నారని తెలుస్తోంది. అంతకుముందు గురువారం కూడా ఫ్రాన్స్ నుంచి ఫొన్ చేసి గవర్నర్‌ను వరద పరిస్థితి గురించి మోదీ అడిగారని సక్సేనా ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం తీసుకుని.. తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.