PM Modi Uttarakhand Visit : ఆదికైలాశ్ను దర్శించుకున్న మోదీ.. పార్వతి కుండ్‌లో స్వయంగా పూజలు - PM Narendra Modi adi kailash visit
Published : Oct 12, 2023, 11:26 AM IST
PM Modi Uttarakhand Visit :ఉత్తరాఖండ్‌లో పిథోరాగఢ్ జిల్లాలోని ఆది కైలాస శిఖరాన్ని గురవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి.. పార్వతి కుండ్‌లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా జగేశ్వర్ ధామ్, సరిహద్దు గ్రామమైన గుంజిని మోదీ సందర్శించనున్నారు. జిల్లాలో రూ.4,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఆది కైలాశ్‌ను సందర్శించిన తరువాత ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 12 గంటలకు చారిత్రక నగరం అల్మోరాలోని జగేశ్వర్ ధామ్‌కు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ మళ్లీ పిథోరాగఢ్‌కు వెళ్లి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పిథోరాగఢ్‌లో సుమారు రూ. 4200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో పాటు ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.