నూతన విద్యా విధానానికి మూడేళ్లు.. స్కూల్‌ను సందర్శించిన ప్రధాని... చిన్నారులతో సరదా సంభాషణ - మోదీ లేటెస్ట్ న్యూస్
PM Modi Interacts With School Children : ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి సరదాగా గడిపారు. నూతన విద్యావిధానం తీసుకొచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన అఖిల భారతీయ శిక్షాసమాగంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి సందడి చేసిన మోదీ.. వారిని ప్రశ్నిస్తూ సరదాగా మాట్లాడారు. మీకు మోదీ తెలుసా? అని పిల్లలను ప్రశ్నించగా.. టీవీల్లో, ఫొటోల్లో చూశామంటూ బదులిచ్చారు చిన్నారులు. ఆ తర్వాత జరిగిన సమావేశంలోనూ చిన్నారులను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యావిధానం సంప్రదాయ విజ్ఞానానికి, భవిష్యత్ సాంకేతికతకు సమాన ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ పథకం కింద పాఠశాలలకు మొదటి విడత నిధులను మోదీ విడుదల చేశారు. కొత్త విద్యావిధానం పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందన్నారు.
ఆచరణాత్మక శిక్షణను ఈ ఎడ్యుకేషన్ పాలసీ ప్రోత్సహిస్తుందనీ, అన్ని రంగాలలోని యువతకు సమాన అవకాశాలను అందించడమే దీని లక్ష్యమని తెలిపారు. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పు, శుద్ధ ఇంధనం వంటి సబ్జెక్టులపై విద్యార్థులకు పాఠశాలల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రపంచం భారత్‌ను కొత్త అవకాశాల నర్సరీగా చూస్తోందనీ.. చాలా దేశాలు ఇక్కడ ఐఐటీ క్యాంపస్‌లను తెరిచేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయన్నారు. యువతకు ప్రతిభా ప్రాతిపదికన కాకుండా భాషా ప్రతిపదికన అవకాశాలు కల్పించడం చాలా పెద్ద తప్పిదమని మోదీ స్పష్టం చేశారు.