Live Video : అయ్యో.. ఎంత పనైపాయే.. చూస్తుండగానే కొట్టుకుపోయే - వాగు దాటుతూ గల్లంతైన వ్యక్తి మృతి
Person Fallen in Floodwater Hanamakonda : హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో వాగుల్లోని నీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తూ.. ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. హనుమకొండ జిల్లాలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ఓ ద్విచక్ర వాహనదారుడు గల్లంతై.. మృతి చెందాడు. బైక్పై నుంచి మహేందర్ అనే వ్యక్తి వాగు మీదగా వెళుతుండగా.. వరద ఉద్ధృతి కారణంగా బైకు అదుపుతప్పి వరద నీటిలో పడిపోయాడు. అనంతరం భారీ ప్రవాహం రావడంతో.. వరద నీటిలో కొట్టుకుపోయాడు. అక్కడున్న వారు చూస్తుండగానే.. గల్లంతయ్యాడు. కనీసం కాపాడటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అక్కడ ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. గల్లంతైన మహేందర్ మృతదేహాన్ని వెలికితీసి కుటుంబసభ్యులకు అప్పగించారు.