తెలంగాణ

telangana

బంగాల్​లో పోలీస్​ స్టేషన్​కు నిప్పంటించిన దుండగులు

ETV Bharat / videos

గిరిజన బాలికపై రేప్​.. న్యాయం చేయాలంటూ పోలీస్​ స్టేషన్​కు నిప్పు..

By

Published : Apr 25, 2023, 10:56 PM IST

గిరిజన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆమెను హతమార్చిన కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయాలంటూ బంగాల్‌లోని కాలియాగంజ్‌లో పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు బాధిత కుటుంబ సభ్యులు. దీంతో పోలీసులు-ఆందోళనకారుల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. బారికేడ్లను తొలగించి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వారిపై లాఠీ ఛార్జ్​ చేశారు. అయితే ఈ వివాదం కాస్త రాజకీయరంగు పులుముకుంది.

అసలేం జరిగిందంటే.. గురువారం (ఏప్రిల్​ 20) సాయంత్రం ట్యూషన్‌ కోసం వెళ్లిన బాలిక(17) తిరిగి ఇంటికి చేరలేదు. ఆమె మృతదేహాన్ని శుక్రవారం ఒక కాలువలో గుర్తించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితునిపై హత్యానేరంతో పాటు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అధికారులు.. శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బంగాల్‌ పోలీసులను జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించింది. బాలిక శరీరంపై గాయాలేమీ లేవని.. మృతదేహానికి సమీపంలో విషంతో కూడిన సీసా కనిపించిందని పోలీసులు తెలిపారు. బాలిక విష పదార్థాలు తీసుకోవడం వల్లే చనిపోయినట్లు శవపరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన బాధిత కుటుంబసభ్యులు.. పోలీస్​ స్టేషన్​కు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేస్తూ గొడవ చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అయితే బాలిక మృతిని బీజేపీ తప్పు దోవ పట్టించి పరిస్థితిని హింసాత్మకంగా మార్చిందని అధికార తృణమూల్‌ కాంగ్రెస్ ఆరోపించింది. 

ABOUT THE AUTHOR

...view details