People Protest against Police : గుడిసెలు తొలగించాలని గొడవ.. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా.. - తెలంగాణ తాజా వార్తలు
People Protest against to Police in Jagtial District : జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇళ్ల స్థలాల కోసం సీపీఐ గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నారు. పట్టణ శివారులోని ప్రభుత్వ స్థలంలో పలువురు పేదలు గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు తెల్లవారుజామున ఆ స్థలం వద్దకు వెళ్లి గుడిసెలను తొలగించి పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బాధితులు, మహిళలు, సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెల తొలగింపును నిరసిస్తూ.. పేదలకు 125 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి అధిక సంఖ్యలో మహిళలు బయలుదేరారు. పెద్ద ఎత్తున ఆర్డీవో ఆఫీస్ దగ్గరకు వెళ్తున్న మహిళలను, సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరగటంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎక్కడివారిని అక్కడికి పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.