'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే గెలుపు తీరాలకు చేరుస్తాయి' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 9, 2023, 9:33 PM IST
Peddapalli BRS Candidate Dasari Manohar Reddy : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్ధి దాసరి మనోహర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా జరగని అభివృద్ధి ఈ తొమ్మిదేళ్లలో జరిగిందని పేర్కొన్నారు. కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆకర్షితులౌతున్నారని తెలిపారు. తనకు ఎవరు పోటీ లేరని తనకు తానే పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చేసే ఆరోపణలు పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తునికి లోకమంతా పచ్చగా అన్నట్లు ఉందని తోసిపుచ్చారు.
విపక్ష పార్టీల నేతలు చేసే ఆరోపణలను నిరూపించాలని గతంలోనే సవాల్ చేశానని మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో నీటి కొరత లేకుండా ఎల్లమ్మ గుండమ్మ చెరువును మీని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేశానని తెలిపారు. నియోజకవర్గంలో కొన్నిచోట్ల బస్సు డిపో లేదని ప్రశ్నించగా.. బస్సు డిపో లేదన్న మాట వాస్తవమే కానీ, ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో తప్పకుండా బస్సు డిపో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.