'నాయకత్వం సమర్థంగా ఉంటేనే దేశం పటిష్ఠంగా ఉంటుంది- మోదీ రాకతో అది సాకారమైంది' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 25, 2023, 11:03 PM IST
Pawan Kalyan Road Show at Quthbullapur : ప్రచారానికి వీడ్కోలు పలికే సమయం, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల హోరును మరింత ఉద్ధృతం చేసింది. అభ్యర్థుల గెలుపునకై పార్టీ అగ్రనేతలతో రోడ్ షోలు.. సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్తోంది. ఈ క్రమంలోనే కుత్బుల్లాపూర్ నియోజక వర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ను గెలిపించాలని.. ఆయనకు మద్ధతుగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా యువకులు, అభిమానులు సహా జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేసిన కేరింతల ధ్వనుల మధ్య.. ఆయన అందరికీ అభివాదం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించేందుకు బలమైన నాయకత్వం కావాలని.. నాయకత్వం సమర్థంగా ఉంటేనే దేశం పటిష్ఠంగా ఉంటుందన్నారు. అది కేవలం మోదీ సర్కార్ వల్లే సాధ్యపడిందని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ముంబాయి దాడులు వంటి జరిగాయని.. మోదీ వచ్చిన తర్వాత ఎక్కడా చిన్న సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవన్నారు.