విరిగిన రైలు చక్రం! అలాగే 10 కి.మీ ప్రయాణం.. ప్రయాణికులు అలర్ట్ అయి.. - పవన్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
బిహార్ వైశాలి జిల్లాలో పవన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎస్ 11 బోగీలోని ఓ చక్రం దెబ్బతింది. దీనిని డ్రైవర్ గమనించకుండా సుమారు 10 కిలోమీటర్లు వెళ్లనిచ్చారు. ప్రయాణికులు గమనించి లోకో పైలట్‌కు చెప్పడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలులోని ప్రయాణికులు అనేక గంటల పాటు అక్కడే ఉండిపోయారు. ఈ ఘటన ముజఫర్‌పుర్-హాజిపుర్ రైల్వే సెక్షన్ మధ్య జరిగింది.
ఇదీ జరిగింది
జయనగర్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్‌కు వెళ్తున్న పవన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ రైలు చక్రం విరిగిపోయింది. దీనిని లోకో పైలట్ గమనించలేదు. దాదాపు 10 కిలోమీటర్లు అలాగే రైలును నడిపించుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత శబ్దం విన్న ప్రయాణికులు.. లోకో పైలట్‌కు తెలియజేశారు. "ముజఫర్‌పుర్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరగానే.. కొద్దిగా శబ్దం వచ్చింది. స్పీడ్ పెరిగే కొద్ది రైలులో శబ్దం మరింతగా పెరిగింది. ఆ తర్వాత భగవాన్‌పుర్ స్టేషన్ వద్ద రైలు ఆగితే.. దిగి చూశాను. ఓ చక్రం విరిగిపోయి కనిపించింది. ఇంతలోనే రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. దీంతో వెంటనే గొలుసు లాగి రైలును ఆపాము. వెంటనే వెళ్లి డ్రైవర్‌కు ఈ విషయం చెప్పాము" అని ఓ ప్రయాణికుడు వివరించాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనా స్థలానికి మరమ్మతుల బృందాన్ని పంపించారు. రైలు సమయానికి ఆపకపోతే భారీ ప్రమాదం జరిగేదన్నారు ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్వో బీరేంద్ర కుమార్.