కారెక్కనున్న పాల్వాయి స్రవంతి - మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ - మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి రాజీనామా
Published : Nov 11, 2023, 3:50 PM IST
Palvai Sravanthi Resigns Congress Party :మునుగోడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆమె వెల్లడించారు. కష్టకాలంలో జెండా మోసిన తనకు సరైన గుర్తింపు లేక, అవమానాలు భరించలేక పుట్టినప్పటి నుంచి ప్రయాణించిన కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధగా ఉందన్నారు. కొంతకాలంగా పదవులు, టికెట్లు కేటాయింపుల్లో అవకతవకలు సాగుతున్న దృష్ట్యా.. పార్టీలో ఇక ఇమడలేక నిష్క్రమించడమే మేలన్న ఉద్దేశంతో తన రాజీనామా లేఖ సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు. ప్రతి కార్యకర్త తన బాధ, భావోద్వేగం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.
Palvai Sravanthi Join in BRS :రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్పొరేట్ పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. ఒక దళారీ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందంటూ భగ్గుమన్నారు. పారాచూట్లకు తావులేదంటూ 50 మంది పైగా అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుని కాంగ్రెస్ బ్రోకర్ పార్టీగా మారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని పార్టీ వీడి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ వస్తే కండువా కప్పారని.. 24 గంటల్లో మునుగోడు టికెట్ ప్రకటించారని మండిపడ్డారు. కనీసం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత పార్టీ ఇంఛార్జిగా ఉన్న తనకు మాట కూడా చెప్పకపోవడం భావ్యమా అని సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రజా పక్షాన నిలబడేది బీఆర్ఎస్ అని భావిస్తున్నట్లు ప్రస్తావించారు. తమ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత బీఆర్ఎస్లో ఎప్పుడు చేరాలన్న నిర్ణయం త్వరలో వెల్లడిస్తానని స్రవంతి చెప్పారు.