తెలంగాణలో ఎన్నికలు - కీలక నీర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం - AP Latest News
Published : Nov 29, 2023, 10:04 PM IST
Paid Leave for AP Employees of Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఆర్జిత సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు.
అయితే తెలంగాణాలో ఓటు హక్కు ఉన్నట్టుగా ఓటరు గుర్తింపు కార్డు చూపితేనే ఆర్జిత సెలవు వర్తిస్తుందంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణాలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు సెలవు మంజూరు చేయాలంటూ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూ సీఈఓ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. తెలంగాణలో నవంబరు 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్న విషయం తెలిసిందే.