9ఏళ్ల బాలికపై ఎద్దు భీకర దాడి.. కొమ్ములతో పైకిలేపి.. ఒక్కసారిగా కిందకు విసిరేసి.. - బాలికపై ఎద్దు దాడి వైరల్ వీడియో
Ox Attack On Girl In Chennai Video : తొమ్మిదేళ్ల బాలికపై ఓ ఎద్దు భీకరంగా దాడి చేసింది. కొమ్ములతో అమాంతం లేపి కిందకు విసిరేసింది. అనంతరం పలుమార్లు తీవ్రంగా దాడి చేసింది. వెంటనే అక్కడికి వచ్చిన స్థానికులు ఎద్దును కొట్టి.. బాలికను రక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
ఇదీ జరిగింది..
అరుంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని చూలైమేడులో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక నివాసం ఉంటోంది. రోజూలానే తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో.. వారి ముందు నడుస్తున్న ఎద్దు ఒక్క సారిగా బాలికపై దాడి చేసింది. కొమ్ములతో అమాంతం ఎత్తి నేలపైకి విసిరేసింది. అనంతరం బాలికపై పలుమార్లు భీకరంగా దాడి చేసింది. బాలిక, ఆమె తల్లి.. అక్కడున్న వారు కేకలు వేసినా ఎద్దు విడిచిపెట్టలేదు. అనంతరం అక్కడున్న వారు ఎద్దుపైకి రాళ్లు రువ్వి బాలికను రక్షించారు. వెంటనే బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఎద్దు యజమాని వివేక్‌పై కేసు నమోదు చేశారు.