పాములా బుస కొడుతున్న గుడ్లగూబలు- మీరు ఈ వీడియో చూశారా?
Published : Dec 30, 2023, 5:44 PM IST
Owls Sounds Like Snake : బిహార్లోని సివాన్ జిల్లాలో ఓ అరుదైన జాతికి చెందిన గుడ్లగూబలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇవి నాగుపాములా బుస కొడుతున్నాయి. ఈ వింత గుడ్లగూబలను చూసేందుకు గ్రామస్థులు బారులు తీరారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
ఇదీ సంగతి!
విస్వార్ గ్రామానికి చెందిన మనన్ సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన ఓ గది చాలాకాలంగా మూసి ఉంది. ఈ గదిలోనే పాముల లాగా బుస కొడుతున్న ఈ గుడ్లగూబలు నివాసం ఏర్పరుచుకున్నాయి. ఈ క్రమంలో మనన్ సింగ్ ఏదో పని మీద గది తలుపులు తెరిచేందుకు అక్కడకు వెళ్లాడు. అక్కడ అతడికి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. దీంతో అతడు పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. అనంతరం వాటిని పట్టేందుకు వచ్చిన వ్యక్తి గదిలోపలికి వెళ్లి చూడగా అక్కడ పాముల్లా బుసలు కొడుతున్న వింత గుడ్లగూబలను చూసి భయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మనన్ సింగ్ ఇంటి వద్ద గుమిగూడారు.
తెలుపు రంగులో నల్ల కళ్లతో ఉన్న ఈ గుడ్లగూబలను చూసిన ప్రజలు, వాటిని రామాయణంలోని జటాయువు పక్షితో పోలుస్తున్నారు. కొందరు వీటికి ఆహారాన్ని కూడా తినిపించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అటవిశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గుడ్లగూబలను పరిశీలించారు. అవి అమెరికాలో ఉండే అరుదైన జాతికి చెందిన పక్షులుగా గుర్తించారు. వాటిని మంచు గుడ్లగూబలు అని కూడా అంటారని వివరించారు.