108 ఏళ్ల ఏజ్‌లో తొలిసారి సంతకం.. 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' కమల! - వైరల్ వీడియోలు
108 ఏళ్ల వయస్సులో తొలిసారిగా సంతకం చేసింది ఓ బామ్మ. ఏడాది క్రితం విద్యార్థిగా మారిన ఆ బామ్మ.. కేంద్ర ప్రభుత్వ పడ్నా-లిఖ్నా పథకం కింద చదువు నేర్చుకుంది. వందేళ్ల వయస్సు అనంతరం రాయడం, చదవడం నేర్చుకుని అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. శతాధిక వయస్సులో చదువు నేర్చుకున్న ఈ బామ్మ పేరు.. కమలా కన్ని. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన ఈమె.. కట్టప్పన వందన్మేడు ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఇన్నేళ్ల వయస్సులో చదువుకుని.. కేరళలోనే అత్యంత వృద్ధ విద్యార్థిగా రికార్డ్ సాధించింది. కమలా కన్నీ మలయాళం, తమిళంలో రెండు భాషల్లోనూ తన పేరు రాస్తోంది. ఈ వృద్ధురాలు సాధించిన ఘనత పట్ల కుటుంబసభ్యుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కమలా కన్ని వయసు 109 ఏళ్లు. ఈ వయస్సులోను ఆ వృద్ధురాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
కమలా కన్ని కుటుంబం తమిళనాడుకు చెందిన వారు కాగా.. వృత్తిరీత్యా కేరళకు వలస వెళ్లారు. తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న ఉడుక్కి జిల్లాలో స్థిరపడ్డారు. "అక్షరాస్యత కార్యకర్తల సహాయంతో చదువు నేర్చుకున్నాను. 108 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను యవ్వనంలో ఉన్నప్పుడు.. దుంపలు, ఆకు కూరలు తినేదాన్ని. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. మంచి ఆహారం తీసుకోవడమే నా ఆరోగ్యం రహస్యం. నేను ఇప్పుడు నాల్గవ తరం మనవళ్లతో ఆనందంగా గడుపుతున్నాను." అని కమలా కన్ని చెబుతున్నారు.