బామ్మకు అనారోగ్యం.. డోలీలో 2.5 కి.మీ మోస్తూ అడవిలో నడక
అనారోగ్యం బారిన పడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు గ్రామస్థులు. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోడం వల్ల వృద్ధురాలిని డోలీలో మోస్తూ 2.5 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటక.. ఉత్తర కన్నడ జిల్లాలోని సనక గ్రామంలో జరిగింది.
సనక గ్రామానికి చెందిన ద్రౌపదీ దేశాయ్(80) అనే వృద్ధురాలు తీవ్ర అస్వస్థతతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. అయితే సనక గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. సనక నుంచి ఘోడెగాలి వరకు వెళ్లాలంటే అటవీ మార్గమే దిక్కు. దీంతో చేసేదేమీలేక బామ్మను దుప్పట్లో కట్టి 2.5 కిలోమీటర్లు అటవీ మార్గంలో నడిచారు. అకాల వర్షాల కారణంగా వారు ప్రయాణించిన రోడ్డు కూడా బురదమయమైంది. సనక నుంచి ఘోడెగాలి గ్రామానికి అతికష్టంగా చేరుకున్నారు. అక్కడ నుంచి బామ్మను ఓ ప్రైవేట్ వాహనంలో దండేలిలోని ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికైనా అధికారులు తమ గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు లేకపోవడం వల్లే గ్రామానికి అంబులెన్స్ రాలేదని వాపోయారు. సనక గ్రామంలో 12 ఇళ్లు ఉండగా.. దాదాపుగా 80 మంది నివసిస్తున్నారు.