వంతెనపై బోల్తా కొట్టిన ఆయిల్ ట్యాంకర్- భారీగా వ్యాపించిన మంటలు- డ్రైవర్, క్లీనర్ సేఫ్ - లుధియానాలో పేలుడు
Published : Jan 3, 2024, 10:25 PM IST
Oil Tanker Caught Fire Ludhiana : పంజాబ్ లుధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలో ఓ వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ , క్లీనర్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మండీ గోబింద్గఢ్లోని ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపేందుకు జలంధర్ నుంచి ట్యాంకర్ బయలుదేరింది. ఖన్నా బస్టాండ్ వంతెన వద్దకు రాగానే ఇంధన ట్యాంకర్ టైర్ పేలి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ట్యాంకర్ బోల్తా పడిన సమయంలో అందులోని డ్రైవర్, క్లీనర్ త్వరగా బయటకు రావడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వంతెన వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించినట్టు చెప్పారు.
ఇటీవలే మహారాష్ట్ర లోనావాలా సమీపంలోని వంతెనపై ఓ ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. అనంతరం ట్యాంకర్ పేలడం వల్ల మంటలు ఎక్స్ప్రెస్వే కింద వెళ్తున్న ప్రయాణికులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు సహా మరో ముగ్గురు మరణించారు.ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.