భారీ కుదుపులు.. ప్రయాణికుల అరుపులు.. ప్రమాద సమయంలో కోరమాండల్ లోపల దృశ్యాలివే! - కోరమాండల్ రైలు ప్రమాదం వీడియో
Odisha Train Tragedy : ఒడిశాలో బాలేశ్వర్ రైలు ప్రమాదం జరగుతోన్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదం జరుగుతున్న సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఉన్న ప్రయాణికుడు ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు ఏసీ కోచ్ ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్నారు. మరోపక్క కొందరు ప్రయాణికులు నిద్రిస్తున్నారు. ఇంకొంతమంది ముచ్చట్లలో మునిగిపోయారు. అలా ఎవరికి వారు వాళ్ల పనుల్లో ఉండగా.. ఒక్కసారిగా కోచ్‌లో పెద్ద కుదుపు వచ్చింది. దాంతో వెంటనే వీడియో తీస్తున్న వ్యక్తి చేతిలో నుంచి ఫోన్ జారినట్లు సమాచారం. దీంతో ఈ వీడియోలోని దృశ్యాలు అంతా గజిబిజిగా మారిపోయి.. ఏం కనిపించకుండా పోయింది. వాటిని చూస్తుంటే.. చీకటి, పెద్ద పెద్ద కేకలు మాత్రమే తెలుస్తున్నాయి. ఆ కుదుపుతో ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు. అయితే ఈ దృశ్యాలు ఒడిశా ప్రమాద ఘటనవే అని చెప్పేందుకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
గత శుక్రవారం లూప్‌లైన్‌లో ఆగిన గూడ్స్ రైలును.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. దాని బోగీలు ఎగిరి పక్కనున్న పట్టాలపై పడడం వల్ల.. ఆ మార్గంలో వెళ్తోన్న బెంగళూరు-హవ్‌డా కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 288 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు పూర్తికావడం వల్ల రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.