Odisha Train Accident: ఒడిశా రైళ్ల ప్రమాదం.. ఏపీ ప్రయాణికుల క్షేమ సమాచారంపై హెల్ప్‌లైన్ ఏర్పాటు - కోరమండల్ ఎక్స్‌ప్రెస్
Odisha Train Accident Updates: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్‌బజార్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై ఏపీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ నుంచి హావ్‌డా వెళ్తున్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ రెండింటిలోనూ తెలుగువాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువ మంది ప్రయాణికులు రాష్ట్రానికి వస్తున్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితా బట్టి తెలుస్తోంది.
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో.. షాలిమార్, ఖరగ్‌పూర్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల్లో విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరుకు ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకు దిగాల్సి ఉంది. ఇదే రైలులో రాజమహేంద్రవరం స్టేషన్ నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కి.. చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్లేలా రిజర్వేషన్లు చేసుకున్నారు.
యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎందరో?:కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ నుంచి హావ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ మన రాష్ట్రంలోని తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లు మీదుగా వెళ్లింది. వీటిలో ఎక్కువ మంది యశ్వంత్‌పూర్, తిరుపతి, రేణిగుంట స్టేషన్లలో ఎక్కారు. అలాగే మన రాష్ట్ర పరిధిలో వివిధ స్టేషన్లలో దిగారు. అలాగే తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్‌పూర్, హావ్‌డా వైపు 52 మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు జాబితాలో వివరాలు ఉన్నాయి.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 ఏపీ వాసులు: ఒడిశాలో రైలు ప్రమాదం దృష్ట్యా పలు రైళ్లు రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. అలాగే రైలు ప్రమాదం దృష్ట్యా పలుచోట్ల హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కోరమాండల్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు. సుమారు వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు డీఆర్‌ఎం పేర్కొన్నాడు. జనరల్ బోగీలో ఎందరు ఏపీ ప్రయాణికులున్నారో తెలియాల్సి ఉందని డీఆర్‌ఎం వెల్లడించారు. బాలాసోర్ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానుందని డీఆర్‌ఎం తెలిపాడు. విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్ వెళ్తోందని వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎందరు ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని డీఆర్‌ఎం పేర్కొన్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు: కోరమాండల్తో పాటు యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాలు, ఇతర సమాచారం కోసం 1070, 112, 18004250101 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ సూచించింది. మరోవైపు ఏపీకి చెందిన ప్రయాణికులు.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో 178 మంది ఉన్నట్టుగా రిజర్వేషన్ చార్టుల ప్రకారం నిర్ధారించారు. ఫస్ట్ ఏసీలో 9 మంది, సెకండ్ ఏసీ బోగీల్లో 17 మంది, థర్డ్ ఏసీ భోగీల్లో 114 మంది, స్లీపర్ క్లాస్ లో 38 మంది ఏపీకి చెందిన వారు ప్రయాణిస్తున్నట్టు అధికారులు పేర్కోన్నారు.
- విశాఖలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08912 746330, 08912 744619
- విజయనగరంలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08922 221202, 08922 221206
- శ్రీకాకుళంలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08942 286213, 286245
- విజయవాడలో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్: 67055
- విజయవాడలో బీఎస్‌ఎన్‌ఎల్ హెల్ప్‌లైన్ నంబర్: 0866 2576924
- రాజమహేంద్రవరంలో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్: 65395
- రాజమహేంద్రవరంలో బీఎస్‌ఎన్‌ఎల్ హెల్ప్‌లైన్ నంబర్: 0883 2420541
- హెల్ప్‌లైన్ నంబర్లు 044-2535 4771, 67822 62286
- బంగాల్ హెల్ప్‌లైన్ నంబర్లు: 033-2214 3526, 2253 5185