200 అంబులెన్సులు.. 1200 మంది సిబ్బంది.. భారీ క్రేన్లతో రెస్క్యూ ఆపరేషన్ ఇలా.. - ఒడిశా రైలు ప్రమాదం ఆపరేషన్
Odisha Train Accident : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలు పూర్తయ్యాయి. భారత రైల్వే చరిత్రలోనే దారుణ ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఈ ప్రమాదంలో.. భారీగా ప్రాణ నష్టం జరిగింది. శుక్రవారం సాయత్రం ఈ ఘటన జరగ్గా.. 300 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. వైద్యులతో పాటు భారత ఆర్మీ, వాయుసేన తదితర విభాగాలు.. బృందాలుగా ఏర్పడి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నాయి. శనివారం మధ్యాహ్నానికి అన్ని సహాయక చర్యలు దాదాపు పూర్తయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
- రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తీరు..
- షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ఓ గూడ్స్ రైలు ఒకేచోట ఈ ప్రమాదానికి గురయ్యాయి.
- ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ఈ పెను ప్రమాదం జరిగింది.
- ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 170 కి.మీ, బంగాల్ రాజధాని కోల్‌కతాకు 250 కి.మీ దూరంలో ప్రమాద స్థలం ఉంది.
- ఘటనపై సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు రంగంలోకి దిగాయి.
- రాత్రి 8.30 ప్రాంతంలో నాటికి బాలేశ్వర్‌లోని తొలి బృందం ఘటన స్థలానికి చేరుకుంది. అనంతరం కటక్, కోల్‌కతా నుంచి మరిన్ని బృందాలు వచ్చాయి.
- మొత్తం తొమ్మిది బృందాలుగా ఏర్పడి క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు సహాయక సిబ్బంది. ముఖ్యంగా ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని తొలుత కాపాడిన వీరికి.. వైద్య బృందాలు సాయం అందించాయి.
- భారీ క్రేన్లు, గ్యాస్, ప్లాస్మా కట్టింగ్ యంత్రాలు వాడుతూ, రైలు కోచ్‌లను విడదీస్తూ.. అందులో ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీసేందుకు శ్రమించాయి. అనంతరం లిఫ్టింగ్ ప్యాడ్‌లతో బాధితులను సమీప ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించాయి.
- రైల్వే కోచ్‌లలో ఇరుక్కుపోయిన 44 మంది బాధితులను రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. 71 మృతదేహాలను బయటకు తీశాయి.
- ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే విషయంపై.. ఈ సంవత్సరంలో దాదాపు 55 సార్లు మాక్ డ్రిల్‌లు చేపట్టినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ వెల్లడించారు.
- సహాయక చర్యల్లో భాగంగా 200 అంబులెన్సులు, 50 బస్సులు ఘటనా స్థలంలో అందుబాటులో ఉంచారు అధికారులు. 45 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
- దాదాపు 1200 మంది రెస్య్కూ సిబ్బంది సాయంతో.. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు అధికారులు.
- కటక్‌నుంచి 25 వైద్య బృందాలతోపాటు మరో 50 మంది వైద్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరికితోడు ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు.
- తీవ్ర గాయాలపాలైన వారికోసం వైద్య బృందాలతో కూడిన రెండు ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ల (ఎంఐ 17)ను రంగంలోకి దించింది భారత వాయుసేన.
- భారత సైన్యం ఆరోగ్య సిబ్బంది కూడా.. అంబులెన్సులు, ఇతర సామగ్రితో క్షతగాత్రులకు చికిత్స అందించారు.
- మరోవైపు బాధితులకు నీరు, టీ, ఆహార పొట్లాలను అందించేందుకు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రైల్వే అధికారులు.