NTR in Politics: గల్లీ నుంచి దిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు.. సమాఖ్య వ్యవస్థ కోసం పోరాడిన ధీరుడు - దిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు
NTR Political News: కృష్ణా తీరాన.. నిమ్మకూరు లోగిలిలో.. ఉదయించిన ముద్దుబిడ్డ.. తెలుగు తేజం.. నందమూరి తారక రామారావు. వెండితెరపై రికార్డుల రాజుగా.. సంచలనాల రారాజుగా.. సరిలేరు నాకెవ్వరు అని చాటిచెప్పారు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. ప్రజలే దేవుళ్లు..సమాజమే దేవాలయం.. అని తెలుగు ఆత్మాభిమాన కెరటమై.. నవ నవోన్మేషమై కొలువు దీరి.. పాలనంటే ఇదీ.. అని సంక్షేమ సంతకంతో అందరి మదిలో కొలువుదీరారు.. దిల్లీ పెత్తనాన్ని ఎదిరించి.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. అన్న గారు.
గల్లీ నుంచే దిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు N.T.R. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల మధ్య గీతను చెరిపేస్తూ... సమాఖ్య వ్యవస్థ కోసం సమైక్యంగా పోరాడిన ధీరుడు. దిల్లీ గద్దెపై పాతుకుపోయిన కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు విభిన్న రాజకీయ శక్తులను కూడగట్టిన మొనగాడు. దేశంలో మరే నాయకుడూ సాహసించని విధంగా "సై అంటే సై" అంటూ... సామ్రాజ్ఞి ఇందిరకు ఎదురునిలిచిన ఒకేఒక్కడు. రాజకీయ ఉత్థాన పతనాలతో నిమిత్తం లేకుండా... జాతీయ ప్రత్యామ్నాయం కోసం అలుపెరగక కృషి చేసిన ధీశాలి నందమూరి తారకరాముడు.
రాజకీయ అరంగేట్రంతోనే అదరగొట్టి... తెలుగునాట కొత్త చరిత్ర సృష్టంచిన N.T.R.. 13 ఏళ్ల ప్రజాప్రస్థానంలో ఉత్థాన పతనాలతో సంబంధం లేకుండా... అనుక్షణం ప్రజల కోసం పాటుపడ్డారు. తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసి.. 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు.