ప్రపంచంలోని తెలుగు వారందరికీ శుభవార్త - ఇకపై విదేశాలలో సైతం ఎన్టీఆర్ స్మారక నాణెం - మింట్ అధికారులతో తానా ప్రతినిధుల సమావేశం
Published : Nov 22, 2023, 8:11 AM IST
NTR Commemorative Coin in Foreign Countries: దేశ విదేశాలలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షుడు శుభవార్త చెప్పారు. కొద్ది నెలల క్రితం నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని 100 రూపాయల స్మారక నాణెంను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ నాణేనికి భారీ ఎత్తున అభిమానుల నుంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో కేవలం భారతదేశంలోనే కాకుండా.. అమెరికా సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్టీఆర్ స్మారక నాణెం సులభంగా అందుబాటులో వచ్చేలా తానా (Telugu Association of North America) ద్వారా ఒక ఒప్పందం జరిగిందని ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షుడు టి.డి జనార్దన్ తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్ మింట్ సీజీఎం నరసింహనాయుడు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌తో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, జనార్దన్‌లు సమావేశమయ్యారు (TANA Representatives Meet HYD Mint Officials). విదేశాల్లో ఎన్టీఆర్ అభిమానులు స్మారక నాణెం కావాలని కోరుతున్న నేపథ్యంలో అధికారులతో సమావేశమైనట్లు నిరంజన్ చెప్పారు. ఎన్టీఆర్ స్మారక నాణెనికి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తానా సహకారంతో విదేశాలలో ఉన్న వారికి నాణెంను పంపించనున్నట్లు మింట్ అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ స్మారక నాణెం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు టి.డి. జనార్ధన్ పేర్కొన్నారు.