MGNREGA: "పని చేస్తున్నాం.. గొంతు ఎండి పోతున్నా.. తాగేందుకు నీళ్ల సౌకర్యం లేదు" - ఉపాధి హామీ కూలీల వీడియో
National Employment Guarantee Scheme in Mbnr: జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలు పని ప్రదేశంలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేసే చోట తాగేందుకు నీళ్లు, సేద తీరేందుకు నీడ వసతులు అధికారులు కల్పించట్లేదని వాపోతున్నారు. గతంలో కూలీలకు పనిముట్లుగా గడ్డపార, సలికెపార ఇచ్చేవారని.. ప్రస్తుతం అవేవీ కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో పనులు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కూలీలకు సంబంధించిన అన్ని అలవెన్స్‌లతో పాటు కూలీ డబ్బులూ క్రమం తప్పకుండా వచ్చేవని.. నేడు ఎస్ఐసీకి మారిన తర్వాత అలవెన్స్‌తో పాటు కూలీ డబ్బులు రావడానికి ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
తవ్వెందుకు ఉపయోగించే గడ్డపారలను మొన చేయించుకునేందుకు కూడా సొంత డబ్బులే పెట్టవలసి వస్తుందని ఒక్కో గడ్డపార మోనా చేయించుకునేందుకు రూ.100 నుంచి రూ.120 ఖర్చు చేస్తున్నామని వాపోతున్నారు. చేసిన పని దినాలకు సంబంధించిన వేతనం సైతం 15 రోజులకు ఒకసారి తమ ఖాతాల్లో జమ చేసే అధికారులు.. నేడు రెండు మూడు నెలలు అయినా పట్టించుకోవడం లేదని దాంతో కుటుంబం గడిచేందుకు అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.