బాల్కొండ బాస్ ఎవరు - ప్రజా తీర్పు ఎటువైపు ?
Published : Nov 8, 2023, 7:00 AM IST
Nizamabad Balkonda Constituency : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ తరఫున అన్నపూర్ణ, కాంగ్రెస్ బరిలో సునీల్ రెడ్డి పోటీపడుతున్నారు. ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని అధికార పార్టీ ప్రస్తావిస్తుండగా... బీఆర్ఎస్ వైఫల్యాలను విపక్ష అభ్యర్థులు ప్రచారంలో వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వల్లే ప్రజల బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు.
Balkonda MLA Candidates : అరాచక, దోపిడి ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయంటూ విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారని కచ్చితంగా కాంగ్రెస్ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రభుత్వం కమిషన్కు పాల్పడుతోందని బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణ ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన పసుపు బోర్డు తనకు అనుకూలంగా మారుతుందని అంటున్నారు.