నిజాం హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థుల ఆందోళన - బషీర్‌బాగ్‌లో నిజాం విద్యార్థుల నిరసన
Published : Dec 11, 2023, 5:08 PM IST
Nizam College Students Protest for Hostel Facilities : హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన చేశారు. నిజాం కాలేజీ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడారు. హాస్టల్లో సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. సమస్యల్ని పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా కళాశాల ప్రిన్సిపల్ భీమా నాయక్‌ని అడిగితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లినా తమను పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బెడ్‌పై ముగ్గురు విద్యార్థులు ఉండాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు ఆందోళన చేశారు. అనంతరం అబిడ్స్ పోలీసుల సమక్షంలో కళాశాల ప్రిన్సిపల్‌తో విద్యార్థులు చర్చలు కొనసాగించారు.
Nizam Students Protest for Semester Exam Fees : మరోవైపు సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదని 15 మంది విద్యార్థులను పరీక్ష రాసేందుకు నిజాం కళాశాల సిబ్బంది అనుమతించలేదు. దీనిపై కూడా కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు ఎగ్జామ్ ఫీజు విషయంలో సమాచారం లేదని, ఇప్పుడు ఫీజు కడతామని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు కోరారు. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వమని చెప్పడంతో ఎగ్జామ్‌ను బహిష్కరించారు. వెంటనే తోటి విద్యార్థుల కలిసి కాలేజీలో ఆందోళన చేపట్టారు.
గతంలో ఇలానే జరిగితే ఫీజు కట్టించుకొని ఎగ్జామ్‌కు అనుమతించారని విద్యార్థులు తెలిపారు. 15 మందికి ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తేనే తాము పరీక్ష రాస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. అబిడ్స్ పోలీసులు కళాశాలకు చేరుకొని ఆందోళన విరమించాలని విద్యార్థులను కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు బెఠాయించారు.