మల్లారెడ్డి యూనివర్సిటీలో మోటివేషనల్ వర్క్‌షాప్ ముఖ్య అతిథిగా నిక్ ఉజీనిక్ - Nick Vujicic attend a program in Hyderabad
Nick Vujicic visited Mallareddy University: ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడొద్దని అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రేరణ వక్త, రచయిత నిక్ వుజిసిక్ విద్యార్థులకు సూచించారు. ఎదుగుదల కోసం ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో ‘ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంట పాటు నిర్విరామంగా ప్రసంగించారు. చేతులు, కాళ్లు పూర్తిగా లేకుండా జన్మించిన వుజిసిక్.. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమించడానికి తన వ్యక్తిగత కథ, జీవన పయనంలో సాధించిన సానుకూల దృక్పథం, పోషించిన పాత్రను విద్యార్థులతో పంచుకున్నారు.
పెళ్లవుతుందని, పిల్లలు ఉంటారని అనుకోలేదు:‘‘జీవితాన్ని నిర్ణయించేది వ్యక్తి వైఖరే. గమ్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించే వారు తప్పకుండా విజయం సాధిస్తారు. మనకెదురయ్యే పరిస్థితులను మార్చడం సాధ్యం కాదు. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. ఆ దిశగా ఉత్తమ ప్రయత్నాలు చేయాలి. అసాధ్యమనే దానికి తావు లేదు. అందుకు నా జీవితమే ఉదాహరణ. కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన నాకు వివాహం అవుతుందని, పిల్లలు ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నలుగురు పిల్లలకు తండ్రినయ్యా. ఏది కావాలన్నా సొంతంగా సాధించుకోవాలనే దృక్పథాన్ని నా తల్లిదండ్రులు అలవాటు చేశారు. ఎవరూ ఎవరి కన్నా తక్కువ కాదు. అలా అని ఎక్కువా కాదు. ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. గౌరవించాలి. విద్యార్థులు సమాజానికి తమవంతుగా తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి’’ అని నిక్ సూచించారు.