TS New Secretariat: తెలంగాణ చరిత్రపుటలో మరో అద్భుత కట్టడం.. నూతన సచివాలయం - తెలంగాణ వార్తలు
Telangana New Secretariat: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిర్మాణాల్లో నూతన సచివాలయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం వంటి భారీ నిర్మాణాలను పూర్తి చేసిన సర్కార్.. తాజాగా కొత్త సచివాలయాన్ని పూర్తి చేసింది. ఆధునిక సాంకేతికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో నిర్మితమైన పాలనాసౌధం హైదరాబాద్ సాగర తీరాన ఠీవీగా నిలిచింది. 26 నెలల సమయంలో నూతన సచివాలయ ప్రాంగణం చరిత్ర పుటల్లో అద్భుత కట్టడంగా నిలవబోతోంది.
సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోతతో.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నూతన సచివాలయం రూపుదిద్దుకుంది. చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన హైదరాబాద్ నగర సిగలో ఇది మరో మకుటం కానుంది. హిందూ, దక్కనీ, కాకతీయ శైలిల కలబోతగా నిర్మాణమైన సువిశాల సచివాలయ భవనం 2 గుమ్మటాలపై జాతీయ చిహ్నాలు తెలంగాణ ఖ్యాతి మరింత పెంచనున్నాయి. రూ.617 కోట్ల అంచనాతో నిర్మితమైన పరిపాలన భవనం ఈ నెల 30 నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం పేరుతో ప్రజలకు సేవలందించనుంది.