TS Secretariat: నూతన సచివాలయం 'ప్రత్యేక వీడియో'.. ఎంత బాగుందో.. - telangana latest news
Telangana New Secretariat Latest Visuals: కొత్త సచివాలయం హైదరాబాద్‌లో మరో ల్యాండ్ మార్క్‌గా మారింది. ఆకర్షణీయంగా ఉన్న నూతన పరిపాలనా సౌధం హుస్సేన్ సాగర్ తీరానికి మరింత శోభను తెచ్చిపెట్టింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, త్వరలో ప్రారంభం కానున్న తెలంగాణ అమరవీరుల స్మారకం, నూతన సచివాలయం ఆ ప్రాంతాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాయి. నిర్మాణ బాధ్యతలు పూర్తి చేసిన "షాపూర్ జీ పల్లొంజీ" సంస్థ.. కొత్త సచివాలయ దృశ్యాలను ప్రత్యేకంగా చిత్రీకరించింది. ప్రాంగణం సహా సచివాలయంలోని అన్ని అంతస్తులు, ఛాంబర్లు.. అందులో ఫర్నీచర్, వసతులు ఇలా అన్నింటితో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం ఇది. ఆధునిక, సంప్రదాయ సౌందర్యాల కలబోత. వనపర్తి సంస్థానాధీశుల ప్రాసాదాలు, రాజస్థానీ రాతి, కాకతీయ కళాఖండాలు, గుజరాతీ రీతులతో కట్టిన కలల సౌధం. తెలంగాణ సంస్కృతి, జీవన స్థితులను అడుగడుగునా నింపుకుని.. మార్మికత, తాత్వికత నిబిడీకృతమై అత్యంత సుందరంగ తయారైంది ఈ అద్భుత కట్టడం. అలనాటి కాలపు ఆలయ గోపురాలు, మధ్య యుగంలోని రాజ భవనాలను తలపించేలా ప్రతిబింబిస్తూ.. భాగ్యనగర నడిబొడ్డున సాగర తీరాన అత్యంత సుందరంగా వెలసింది ఈ అద్భుత సృష్టి. తెలంగాణ గొప్పతనాన్ని నలుదిశలా చాటిచెప్పేలా తెలంగాణ నూతన సచివాలయం ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ పాలనా సౌధాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.