కొత్త పార్లమెంట్ డిజైన్‌లో 1120 కిలోల కేక్- చంద్రయాన్-3, క్లాక్ టవర్ కూడా, ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ షో! - కొత్త పార్లమెంట్ భవనం ఆకారంలో భారీ కేక్ తయారీ
Published : Dec 19, 2023, 12:16 PM IST
|Updated : Dec 19, 2023, 12:36 PM IST
New Parliament Building Cake In Bangalore :కర్ణాటక బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆవరణలో ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ షోను నిర్వహిస్తున్నారు సీ.రామచంద్రన్ అనే డెయిరీ ఫార్మ్ యజమాని. డిసెంబర్ 15న ప్రారంభమైన ఈ ప్రదర్శనలో నూతన పార్లమెంట్ భవనం ఆకారంలో తయారు చేసిన 1120 కిలోల భారీ కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని తయారు చేయటానికి రెండున్నర నెలల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీని పొడవు 14 అడుగులు, వెడల్పు 9 అడుగులు ఉందని తెలిపారు. దీంతో పాటు చంద్రుడిపై కాలు మోపేందుకు ఇస్రో లాంఛ్ చేసిన చంద్రయాన్-3 మిషన్ డిజైన్లోనూ ఓ భారీ కేక్‌ను తయారు చేశారు.
కర్ణాటకలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం 'శక్తి' థీమ్‌లో కూడా కేక్‌ను రూపొందించారు. ఇదే కాకుండా క్లాక్ టవర్, ఛత్రపతి శివాజీ, చర్చీ సహా వివిధ రూపాల్లో రంగురంగుల కేక్‌లను తయారు చేయించారు నిర్వాహకులు. మొత్తం 23 రకాల్లో 6,062 కిలోల కేక్‌లను ప్రదర్శనలో ఉంచారు. వీటిని చూసిన సందర్శకులు నిర్వాహకుల పనితీరును ప్రశంసిస్తున్నారు. కాగా, క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ కేక్ షోను జనవరి 1వరకు నిర్వహించనున్నారు.