Navratri celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. బాలా త్రిపుర సుందరిగా భద్రకాళీ అమ్మవారు
Published : Oct 15, 2023, 12:55 PM IST
Navratri celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శంచుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి(Bhadrakali Ammavaru) దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.
మొదటి రోజు అమ్మవారు.. బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనిమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారికి అర్చకులు.. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Dussehra celebrations at Basara Saraswathi Temple : నిర్మల్ జిల్లాలోని చదువుల తల్లి బాసర సరస్వతీ దేవి ఆలయంలో.. శ్రీ శారదియ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శైలపుత్రి అవతారంలో దర్శనిమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు.. పెద్ద సంఖ్యలతో తరలివస్తున్నారు. ఆలయాలన్నీ అమ్మవార్ల నామస్మరణలతో మార్మోగుతున్నాయి. భక్తులకి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
Navaratri Utsavalu at Jubilee Hills : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బాలా త్రిపుర సుందరాదేవి(Bala Tripura Sundaradevi)గా ఉదయం నుంచి అమ్మవారిని అభిషేకాలు చేస్తున్నారు.