అణిచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైంది: నారా లోకేశ్ - లోకేశ్ వార్తలు
Published : Dec 18, 2023, 8:51 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra to End at Aganampudi in Vizag: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం నేటితో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖ జిల్లా అగనంపూడి వద్ద లోకేశ్ పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం అని నారా లోకేశ్ వెల్లడించారు. యువగళం అణిచివేతకు గురైన వర్గాల గొంతుకైందని పేర్కొన్నారు. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగిందని నారా లోకేశ్ తెలిపారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై చేసిన దాడిని కళ్లారా చూసానని, భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చానని వెల్లడించారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని లోకేశ్ తెలిపారు.
యువగళం ముగింపు కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నందమూరి వసుంధర, కుటుంబసభ్యులతో పాటుగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు. పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. యువగళం ముగింపు రోజు కావడంతో లోకేశ్ వెంట వేలమంది ప్రజలు నడిచి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర సందర్భంగా గాజువాక రోడ్డు జనసంద్రంగా మారింది. 2 కి.మీ. పొడవు సాగిన ర్యాలీ కారణంగా గాజువాక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.