Nara Bhuvaneshwari Speech : అరెస్టు చేసి జైలులో పెట్టాక విచారణా..? చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దాం : భువనేశ్వరి
Published : Sep 27, 2023, 1:39 PM IST
|Updated : Sep 27, 2023, 3:26 PM IST
Nara Bhuvaneshwari Speech : ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని.. నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకోకుండా.. ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధించారన్నారు. ఏం తప్పు చేశారో ఇప్పటికీ నిరూపించలేకపోయారని మండిపడ్డారు. బాబు కోసం మద్దతుగా రోడ్డెక్కిన వారిపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంక్షలు, అరెస్టులకు వెరవకుండా... చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ... తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో తెలుగుదేశం చేపట్టిన దీక్షలకు భువనేశ్వరి మద్దతిచ్చారు. బాబు కోసం నేను సైతం అంటూ నినదించారు. చంద్రబాబు తప్పుచేయలేదని ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోకుండానే జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశారో ఇప్పటివరకు నిరూపించలేకపోయారన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన యువత లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు దుర్మార్గంగా ప్రవరిస్తున్నారని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే... మహిళలకు రక్షణ ఉంటుందని భువనేశ్వరి పునరుద్ఘాటించారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తన్నారని భువనేశ్వరి మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడటం తప్పా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా.... యువగళాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అరెస్టులు, ఆంక్షలకు భయపడకుండా న్యాయం కోసం పోరాడాలని ప్రజలకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు.
అంతకు ముందు.. రాజమహేంద్రవరం జాంపేటలోని సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలంటూ ప్రార్థించారు. బాబు త్వరాగా బయటకు వచ్చి ప్రజా సేవ చేస్తారని పాస్టర్లు ప్రార్థించారు. భువనేశ్వరిని ఆశీర్వదించారు