Musi river flood : మూసీకి ఉద్ధతంగా వరద.. రుద్రవెల్లి, జూలూరు మధ్య నిలిచిన రాకపోకలు
Musi river floods Nalgonda : విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతోనూ యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగం లోలేవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద లోలేవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట్ నుండి వరద ఉదృతి పెరగడంతో మూసీలో ప్రవాహం కూడా కొంతమేర పెరిగింది. లంగర్ హౌస్, జియాగూడ వద్ద మూసీలో పరిధిలో ఉన్న దేవాలయాలు కొంతమేర మునిగిపోయాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు.. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను మూడు ఫీట్ల వరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 10 వేల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.50 అడుగుల వరద నీరు వచ్చి చేరుతోందని వెల్లడించారు.